– తెలంగాణలో కాంగ్రెస్ జయకేతనం
– 64 సీట్లలో విజయం
– బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7
– రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం
– ప్రగతి భవన్ ఇక అంబేద్కర్ ప్రజా భవన్
– ఇది తెలంగాణ ప్రజల గెలుపన్న రేవంత్
– సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
– గవర్నర్ తమిళిసై ఆమోదం
అనుముల రేవంత్ రెడ్డి… సొంత పార్టీనే ధిక్కరించి జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన లీడర్. ఎన్నో వివాదాలు.. మరెన్నో కేసులు.. కానీ, తన పంథా మారలేదు. ప్రత్యేక తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. స్వపక్షం నుంచే విమర్శలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. తనదైన దూకుడుతో అందర్నీ కలుపుకుపోయి హస్తానికి అధికారాన్ని అందించారు. గులాబీ పాలనను తరిమికొట్టారు.
ఉత్కంఠ రేపిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 64 సీట్లు రాగా బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐ ఒక స్థానంలో విజయం సాధించాయి. దీంతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కల నెరవేరినట్టయింది. రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
ఈ విజయంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బాధ్యతను అన్నారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ముందుంటుందని.. హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని వెల్లడించారు. తాను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్లామని.. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని.. అదే రోజున ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారన్నారు.
ప్రతిపక్షంగా కొత్త ప్రభుత్వానికి బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితిలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు రేవంత్. తమ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. ఇకపై ప్రగతి భవన్ పేరును మారుస్తామని, డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని తెలిపారు. అందులోకి సామాన్యులందరికీ ప్రవేశం ఉంటుందని.. సచివాలయం గేట్లు కూడా అందరికీ తెరుచుకుంటాయని స్పష్టం చేశారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి.