నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ (BRS) అడ్డదారుల్లో అధికారం దక్కించుకోవడానికే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేలా చేస్తుందని మండిపడ్డారు.. నాగార్జునసాగర్ ( Nagarjunasagar) వద్ద జరిగింది ఓ వ్యూహాత్మక అడుగనేనని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ చీప్ పాలిట్రిక్స్ ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
కొడంగల్ (Kodangal)లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు.. ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఇలా బహిరంగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడటం చూస్తుంటే.. అధికార పార్టీ దౌర్జన్యం ఎంతలా ముదిరి పోయిందో అర్థం అవుతుందని విమర్శించారు.
ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపవని రేవంత్ తెలిపారు. ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. మరోవైపు నాగార్జున సాగర్ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అర్థరాత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర హైడ్రామా నడిచింది.
నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఏపీ పోలీసులు గేటు నెంబర్ 13 ఓపెన్ చేయటానికి ప్రయత్నించారు. ఏపీ (AP) వాటా నీటిని విడుదల చేసుకుంటామంటూ ప్రాజెక్టు దగ్గరికి వందలాది మంది పోలీసులు రావడం చర్చాంశనీయంగా మారింది. మరోవైపు విషయం తెలిసిన తెలంగాణ (Telangana) పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పల్నాడు జిల్లా నుంచి ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు కూడా రావటంతో డ్యామ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.