తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ప్రస్తుతం రెండు నియోజక వర్గాలపై జోరుగా చర్చ సాగుతుంది. కామారెడ్డి (Kamareddy)..గజ్వేల్ (Ghazwal) నియోజక వర్గాలలో పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠంగా మారింది. ఈ రెండు స్థానాలలో కేసీఆర్ (KCR)బరిలో ఉండగా.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి.. గజ్వేల్ లో ఈటల గులాబీ బాసుకు గట్టి పోటీ ఇస్తున్నారని అనుకుంటున్నారు.
ఒకరకంగా ఈ రెండు నియోజక వర్గాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని తెలుస్తుంది. ఇక కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి దిగిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీపై క్లారిటీ ఇచ్చారు.. కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే తాను ఇక్కడి నుంచి పోటీకి దిగినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కామారెడ్డి భూముల కబ్జా చేయడానికి వచ్చాడని ఆరోపించిన రేవంత్.. పొరపాటున గెలిపించారో భూములన్నీ పోతాయని హెచ్చరించారు.
పదేళ్ల నుంచి సీఎంగా ఉన్న కేసీఆర్, పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే.. భూములకు పట్టాలు ఇవ్వలే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదని రేవంత్ విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యే కు ఈ విషయాలు తెలిసినా మళ్ళీ ఓట్లకోసం మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్ ఓట్ల కోసం ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందట అని వ్యంగాస్త్రం వేశారు.
సిద్దిపేట, సిరిసిల్ల కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగిడం వెనక ఉన్న మర్మం అర్థం చేసుకోవాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి.. ఎన్నికలున్న క్రమంలో మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేసిన పెద్ద మనిషి.. ఎన్నికల తరువాత మళ్ళీ మీ భూములను గుంజుకుంటాడని ఆరోపించారు. కేసీఆర్ ను నమ్మడమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లే అని రేవంత్ రెడ్డి విమర్శించారు.. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ హామీ ఇచ్చారు..