తెలంగాణలో కాంగ్రెస్ (Congress) మంచి దూకుడు మీద ఉంది. ఇప్పటికే పలు డిక్లరేషన్లను ప్రకటించి కాంగ్రెస్ ఊపు మీద ఉంది. తాజాగా ముస్లిం డిక్లరేషన్ (Muslim Declaration)ను ఆ పార్టీ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని సిటీ కన్వెన్షన్‌లో మైనార్టీ డిక్లరేషన్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ముస్లింల కోసం ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ. 5 లక్షల నగదు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉర్దూ మీడియం టీచర్ల కోసం ప్రత్యేకంగా డీఎస్సీని నిర్వహిస్తామన్నారు. ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురి కాకుండా డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడుతామన్నారు.
మైనార్టీల కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మైనార్టీల కోసం ఏడాదికి రూ.4వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. దీంతో పాటు రూ.వెయ్యి కోట్ల రుణాలను అందజేస్తామన్నారు. ఎంపీహెచ్ఎల్ పూర్తి చేసిన మైనార్టీలకు రూ.5లక్షల అర్థిక సాయం చేస్తామన్నారు.
ముస్లీం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమిని కేటాయిస్తామన్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు రూ.లక్ష 60వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. 6 నెలల్లోగా కుల గణనను చేపట్టి ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనారిటీల సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చూడాలన్నారు.
ఇమామ్‌లు, మ్యూజిన్‌లు, ఖాదీమ్‌లు, పాస్టర్, గ్రంథిలతో సహా అన్ని మతాల పూజారులకు నెలవారీ గౌరవ వేతనం రూ.10,000-12,000 అందజేస్తామన్నారు. సెట్విన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణను పునరుద్ధరిస్తామన్నారు. ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA)ను ఏర్పాటు చేస్తామన్నారు.