తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy). గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆయన చేత ప్రమాణం చేయించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఎల్బీ స్టేడియానికి రాహుల్, సోనియా, రేవంత్ ఒకే కారులో వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజల సమక్షంలో సీఎంగా ప్రమాణం చేశారు రేవంత్ రెడ్డి. కరెక్ట్ గా గురువారం (డిసెంబర్ 7) మధ్యాహ్నం 1.21 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక, రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ మంత్రుల జాబితాను హైకమాండ్ గురువారం ఉదయం విడుదల చేసింది. కేబినెట్ లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు అందజేశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇదే జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కింది.
నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించారు. నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహలకు కూడా కేబినెట్ లో చోటు లభించింది.
మరోవైపు, తెలంగాణ స్పీకర్ గా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో టెక్స్ టైల్ మంత్రిగా ఈయన పని చేశారు. ఈయనది దళిత సామాజిక వర్గం. కొత్త అసెంబ్లీ కొలువు దీరిన తర్వాత ఎమ్మెల్యేలందరి చేత ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం వారంతా కలిసి స్పీకర్ గా ఒకరిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే గడ్డం ప్రసాద్ పేరును స్పీకర్ పోస్ట్ కోసం కాంగ్రెస్ పరిశీలించి సూచన ప్రాయంగా ఖరారు చేసిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలు ఆయనను ఎన్నుకోవడం లాంఛనప్రాయమే అవుతుంది.