తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)ప్రమాణం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారాని (Swearing Ceremony)కి మరి కొద్ది గంటలే మిగిలి వుంది. రేపు మధ్యాహ్నం 1: 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేస్తారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఏఐసీసీ నేతలతో పాటు పలు రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు.
ఈ కార్యక్రమానికి ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఆహ్వానం పంపారు. వారితోపాటు కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
ఇది ఇలా వుంటే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొవాలని ప్రజలను ఆయన కోరారు. రాష్ట్రంలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం రాబోతోందన్నారు. దీన్ని కండ్లారా చూసేందుకు ప్రజలు రావాలని లేఖలో ఆయన కోరారు.
మరోవైపు 300 మంది అమర వీరుల కుటుంబాలకు కూడా టీపీసీసీ ఆహ్వానం పంపింది. దీంతో పాటు 250 మంది తెలంగాణ ఉద్యమకారులను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రేపు హైదరాబాద్ కు రానున్నారు.