తెలంగాణలో కాంగ్రెస్ (Congress), సీపీఐ (CPI) మధ్య పొత్తు పొడిచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సీపీఐ పార్టీ ఓకే చెప్పింది. సీట్ల విషయంలో ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కొత్తగడెం సీటును సీపీఐకి కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంపై సీపీఐ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సీట్ల పంపకంపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చ జరిగింది.
సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి నారాయణ, కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం నియోజక వర్గం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల అనంతరం రెండు ఎమ్మెల్సీ సీట్లను సీపీఐకి ఇస్తామని పేర్కొన్నారు.
చట్టసభల్లో వామపక్షాలు ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని రేవంత్ సూచించారు. ఎన్నికల ప్రచారంపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సీపీఐ నారాయణ మాట్లాడుతూ….. నెల క్రితం నిశ్చితార్థం జరిగిందని, ఇపుడు పెళ్లి జరిగిందన్నారు. కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్‌ను ఓడిస్తామన్నారు.