షహీద్ చిట్టప్రియ రాయ్ చౌదరి (Chittapriya Ray Chaudhari).. 21 ఏండ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు విడిచిన గొప్ప వీరుడు. చిన్న వయసులోనే విప్లవ సంఘంలో చేరి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన భరత మాత ముద్దు బిడ్డ. జర్మనీ సహాయంతో బ్రిటీష్ వాళ్లపై దాడికి యత్నించి ప్రాణాలు వదిలిన స్వాతంత్ర్య సమరయోధుడు.
1894 జూలై 2న బెంగాల్ లోని ఖలియా గ్రామంలో జమిందారీ కుటుంబంలో జన్మించారు. కావాలనుకుంటే ఆయన విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ, ఆయన మనసు దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించింది. అందుకే, చిన్నతనంలోనే విప్లవ బాట పట్టారు. అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసులో ఆయుధం చేతబట్టారు. పూర్ణదాస్ ఆధ్వర్యంలోని రహస్య విప్లవ సంఘంలో చేరి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు.
బ్రిటీష్ సైన్యంపై మెరుపుదాడులు చేశారు. ఈ క్రమంలో 19 ఏండ్ల వయసులోనే ఫరీద్ పూర్ కుట్ర కేసులో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కలకత్తా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో బ్రిటీష్ అధికారిని కాల్చి చంపారు చిట్టప్రియ రాయ్ చౌదరి.
తన 20 ఏట బ్రిటీష్ వాళ్లపై అతి పెద్ద దాడికి ప్రణాళికలు రచించారు. జర్మనీ నుంచి అధునాతన ఆయుధాలు తెప్పించి ఆంగ్లేయులపై దాడి చేయాలనుకున్నారు. మావేరిక్ నౌకలో వస్తున్న ఆ ఆయుధాలను తీసుకు వచ్చేందుకు వెళ్లి పోలీసుల చేతికి చిక్కారు. ఈ క్రమంలో కాల్పులు జరపగా.. ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.