షహీద్ రాంజీ గోండ్ (Shaheed Ramji Gond)… సిపాయిల తిరుగుబాటు ((Indian Rebellion of 1857) లో తెలంగాణను భాగస్వామిగా చేసిన ఆదివాసీ పోరాట యోధుడు. గోండు జాతి బిడ్డలను ఏక తాటిపైకి తెచ్చి ఆంగ్లేయుల అరాచకాలకు ఎదురు తిరిగిన గిరిజన సింహం. రోహిల్లా సేనలతో కలిసి తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన అగ్గి బరాటా. గెరిల్లా యుద్ధ విద్యలతో బ్రిటీష్ సైన్యాన్ని చావు దెబ్బ తీసిన మన్యం పులిబిడ్డ.
1857లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. చాపకింద నీరులా ఇది దేశం మొత్తం వ్యాపించింది. ఒక దశలో ఈ తిరుగుబాటు బ్రిటీష్ సామ్రాజ్య మూలాలను సైతం కదిలించింది. నిజాం రాజ్యంలోని చాలామందిలో బ్రిటీష్ వ్యతిరేక భావనలు పెరిగిపోయాయి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో కొంతమంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
వారిలో రాంజీ గోండు ముఖ్యులు. రైతాంగాన్ని అణచి వేయడం, అధిక పన్నుల పేరిట రైతుల రక్తాన్ని పీల్చడం, ఎదురు తిరిగిన వారిని చంపివేయడం లాంటి ఎన్నో అరచకాలను నిజాం ప్రభుత్వం చేస్తూ వచ్చింది. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. 1857 తిరుగుబాటు మొదలు కాగానే ఆదిలాబాద్ కేంద్రంగా రాంజీ గోండు తన తిరుగుబాటును ఉధృతం చేశారు. 500 మందితో కలిసి గోండు సైన్యాన్ని ఏర్పాటు చేశారు.
రోహిల్లా సైన్యంతో కలిసి బ్రిటీష్, నిజాం సేనలను ఊచకోత కోశారు. గెరిల్లా దాడులతో అటు నిజాం ప్రభువుకు, ఇటు బ్రిటీష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఈ క్రమంలో రాంజీ గోండును నిజాం సైన్యం దొంగ దెబ్బ తీసింది. ఆయనతో పాటు వెయ్యి మందిని బంధించింది. 1860 ఏప్రిల్ 9న నిర్మల్ లోని ఊడల మర్రికి వారందరినీ ఉరితీసింది.