Telugu News » BRS : ఎవరు 420..? తొందరపడి ముందే కూసిన కేసీఆర్..!

BRS : ఎవరు 420..? తొందరపడి ముందే కూసిన కేసీఆర్..!

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారు. వాటిలో చాలా వరకు విస్మరించారని ఆరోపణలు ఉన్నాయి.

by admin
congress-leaders-are-criticizing-brs-leaders

– కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బుక్ లెట్
– 420 హామీల పేరుతో విడుదల
– ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవకముందే బీఆర్ఎస్ అత్యుత్సాహం
– వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామంటున్న హస్తం
– కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలపై నిలదీత
– కేసీఆర్ మంత్రి వర్గం ఎప్పటికి ఏర్పడిందో గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు

తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చి నెల రోజులు కూడా గడవలేదు. ఈ కొద్ది రోజుల్లోనే అన్ని శాఖల్లో పట్టు కోసం సీఎం, మంత్రులు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, అవినీతిపై ఆరా తీస్తూ చర్యలకు కూడా సిద్ధమయ్యారు. త్వరలో కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ విడుదల చేసిన బుక్ లెట్ హాట్ టాపిక్ గా మారింది.

congress-leaders-are-criticizing-brs-leaders

లోక్​ సభ ఎన్నికల నేపథ్యంలో కార్యాచరణ సమావేశాలను ప్రారంభించింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్ వేదికగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ పెద్దలు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నాయకులు సమావేశాలను నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంపై చర్చించారు. అయితే.. ఈ మీటింగ్ ​లో ‘‘కాంగ్రెస్ 420 హామీలు’’ పేరుతో బుక్‌ లెట్ విడుదల చేశారు. హామీల అమలును గుర్తు చేసేలా దీన్ని బీఆర్ఎస్ తయారు చేసింది.

ఆరు గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్లు అంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో బుక్ లెట్ రూపొందించింది గులాబీ పార్టీ. లోక్‌ సభ ఎన్నికల కోడ్ రాకముందే నెరవేర్చాలని పట్టుబడుతోంది. ఎప్పటికప్పుడు వాటిని గుర్తు చేస్తూ కాంగ్రెస్‌ పై ఒత్తిడి తెస్తామని చెబుతోంది. అయితే.. వంద రోజుల్లో అన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవకున్నా.. 420 హామీలు అంటూ బీఆర్ఎస్ బుక్ లెట్ విడుదల చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు, నెల రోజుల పనితీరును గుర్తు చేస్తూ హస్తం నేతలు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారు. వాటిలో చాలా వరకు విస్మరించారని ఆరోపణలు ఉన్నాయి. దళిత సీఎం మొదలు, మూడు ఎకరాల హామీ, నిరుద్యోగ భృతి, దళిత బంధు ఇంకా ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో హామీలను కేసీఆర్ మరిచారని.. అధికార గర్వంతో వ్యవహరించిన ఆయన్ను చివరికి ప్రజలు ఓడించినా తీరు మారలేదని హస్తం నేతలు మండిపడుతున్నారు. గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ముందు నుంచి చెబుతున్నా.. గులాబీ నేతలు తొందరపడి ముందే కూస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మంత్రి వర్గాన్ని ఎప్పటికి ఏర్పాటు చేశారో అందరికీ తెలుసని.. అలాంటి మీరు తమను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.

అమలుకాని కేసీఆర్ హామీలు

దళిత సీఎం
దళితులకు మూడెకరాలు
నిరుద్యోగ భృతి
దళిత బంధు (కొందరికే.. అవినీతి ఆరోపణలు)
ఏకకాలంలో రైతు రుణమాఫీ
ప్రభుత్వ ఉద్యోగాలు
డబుల్ బెడ్రూం ఇళ్లు (కొందరికే)

కాంగ్రెస్ గ్యారెంటీలు

మహిళలకు ప్రతి నెలా రూ.2,500
పేద మహిళలకు రూ.500కే వంట గ్యాస్
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు
కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు
వరికి మద్దతు ధర కల్పించడంతోపాటు రూ.500 బోనస్‌
పేదవారికి ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం
పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా
అర్హులకు చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్
కళాశాల విద్యార్థులకు ఉన్నత విద్య కోసం రూ.5 లక్షలు

You may also like

Leave a Comment