ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila)పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. షర్మిల పాత్ర ‘వ్యూహం’ సినిమాలో ఉంటుందని తెలిపారు. అయితే, ఆమె పాత్రకు అంత ప్రధాన్యత లేదని వర్మ తేల్చేశారు.
జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ప్రజలు షర్మిలలో జగన్‌ను చూసుకోవడానికే మీటింగ్‌లకు వచ్చారని అన్నారు. అంతేకానీ షర్మిల కోసం రాలేదని సెటైర్లు వేశారు. దీనికి ప్రూఫ్‌గా షర్మిల పార్టీ పెట్టినప్పుడు భారీగా ప్రజలు రాలేదనీ… జగన్ కోసం షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీగా జనం వచ్చారని ఆయన తెలిపారు.
అదేవిధంగా జగన్‌ను స్టడీ చేయడం ద్వారా ఈ విషయాలను గ్రహించానని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. జగన్‌ను ఐరన్ అనడానికి కారణాన్ని సైతం ఆయన వివరించారు. వైఎస్సాఆర్ మరణం తర్వాత హైకమాండ్‌కు ఎదురెళ్లి.. ఓదార్పుయాత్ర చేశారని గుర్తు చేశారు. వైఎస్సాఆర్సీపీ పార్టీ పెట్టారని తెలిపారు. ధృడ సంకల్పం కారణంగానే జగన్ ఐరన్‌లా మారారని అన్నారు. అందుచేతనే జగన్‌పై మూవీ తీశానని ఆయన వివరించారు.
ఇదిలా ఉంటే షర్మిలనే స్వయంగా తాను జగన్ వదిలిన బాణం అని చెప్పారని రామ్ గోపాల్ వర్మ గుర్తు చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు జగన్ వదిలిన బాణం జగన్‌కు గుచ్చుకునేందుకు వస్తోందని అంటున్నారని తెలిపారు. అయితే, జగన్ ఐరన్ లాంటివాడనీ… బాణమే విరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.