ఆదిలాబాద్(Adilabad) రిమ్స్(RIMS)లో విద్యార్థుల ఆందోళనలు(Students agitation) కొనసాగుతున్నాయి. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్(Director Jayasingh Rathod)ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రెండో రోజు ఆందోళనలు చేస్తున్నారు.
కాగా, ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోపాటు క్యాంపస్‌లోకి వచ్చిన బయటి వ్యక్తులే తమపై దాడికి పాల్పడ్డారని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. విద్యార్థులతో కలిసి కాలేజీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు.
వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. అయినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. డైరెక్టర్ జయసింగ్ రాథోడ్‌నూ తొలగించాలని ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనపై కమిటీ సభ్యులు విచారణ జరుపుతున్నారు.