Telugu News » BJP : పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ బడా ప్లాన్స్

BJP : పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ బడా ప్లాన్స్

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి తెలంగాణలో కాస్త మెరుగైన స్థానాలే దక్కాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సీట్లలో సత్తా చాటి.. నలుగురు ఎంపీలు లోక్ సభ మెట్లెక్కారు. కానీ, ఈసారి ఆ సంఖ్యను డబుల్ చేయాలని చూస్తోంది రాష్ట్ర నాయకత్వం.

by admin
bjp-big-plans-for-parliament-elections

– పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు
– రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం
– కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం
– ఈసారి మెరుగైన స్థానాలు గెలిచేలా ప్లాన్స్
– అభ్యర్థులుగా తెరపైకి కొత్త ముఖాలు
– జనసేన పార్టీతో కటీఫ్
– పార్టీ అధ్యక్ష మార్పుపైనా క్లారిటీ
– ఆంధ్రాలోనూ వ్యూహాత్మక అడుగులు

దక్షిణాదిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. అధికారంలో ఉన్న కర్ణాటకను వదులుకోవాల్సి వచ్చింది. గెలుస్తామని ధీమాగా చెప్పిన తెలంగాణ (Telangana) లో 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హేమాహేమీలు సైతం ఓటమి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలక మార్పులకు బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. నాయకుల మధ్య సమన్వయం, పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన సమావేశం జరగగా.. ముఖ్యనేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

bjp-big-plans-for-parliament-elections

డబుల్ ఆశలు నెరవేరేనా?

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి తెలంగాణలో కాస్త మెరుగైన స్థానాలే దక్కాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సీట్లలో సత్తా చాటి.. నలుగురు ఎంపీలు లోక్ సభ మెట్లెక్కారు. కానీ, ఈసారి ఆ సంఖ్యను డబుల్ చేయాలని చూస్తోంది రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలోనే తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళాలని ఇప్పటికే క్యాడర్ కు ఆదేశాలు వెళ్లాయి. కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు. అలాగే, పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు అగ్ర నేతలు. పక్కా ప్లాన్ తో ముందుకెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల సీఎంల ఎంపికతో గుణపాఠం

కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడంతో.. పార్లమెంట్ స్థానాలను ఛాలెంజింగ్ గా తీసుకుంది బీజేపీ. అసెంబ్లీ ఫలితాలు తేడాగా వచ్చినా.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు సవాల్ విసరాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ అంటే నేనే అనే వారికి చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొత్త వారిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాత్మకంగా కొన్ని స్థానాల్లో కొత్త ముఖాలను వెలుగులోకి తెచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో గెలుపు గుర్రాలకే పార్లమెంట్ టికెట్లు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో గెలుపు, ఓటములపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన అగ్ర నేతలు.. అన్నింటిపై సమీక్షించుకుని లోక్ సభ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

పార్టీ అధ్యక్ష మార్పు లేనట్టే..!

అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడ్ని మార్చి పెద్ద తప్పిదం చేసిందనే అపవాదు మూటగట్టుకుంది హైకమాండ్. మరో రెండు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తే సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సారథ్యంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే యోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడానికి, అధిష్టానం ఆలోచనలు అమలు చేసేందుకు కిషన్ రెడ్డినే పార్టీ రాష్ట్ర సారథిగా కొనసాగించాలని అగ్ర నేతలు భావిస్తున్నారు.

తెలంగాణలో జనసేనతో కటీఫ్..!

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. 119 స్థానాల్లో పోటీ చేయగా.. 8 చోట్ల విజయం సాధించింది. కానీ, జనసేన పోటీ చేసిన 8 చోట్లా ఓటమి ఎదురైంది. జనసేనతో పొత్తు బీజేపీకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగిందని సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టంతో బీజేపీ ముందుగానే అప్రమత్తమైంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల చివరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తారని తెలిపారు.

ఆంధ్రాలో కూడా పొత్తుకు గుడ్ బై చెప్తారా?

బీజేపీకి ఆంధ్రాలో కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనే మీమాంస నెలకొంది. ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీకి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ ఇబ్బందులు పడుతోంది. టీడీపీతో పొత్తు వద్దని అనుకుంటోంది. తెలంగాణలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేయాలా? లేక జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? పొత్తులు కుదురకపోతే ఒంటరిగా పోటీ చేయాలా? అలా చేస్తే వచ్చే లాభమేంటి? నష్టమేంటి? ఇలా అనేక అంశాలపై ప్రస్తుతం దృష్టి సారించారు ఆపార్టీ నేతలు. ఏపీలో ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం లోక్ సభ ఎన్నికలకు బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదనే క్లారిటీ వచ్చేసింది.

You may also like

Leave a Comment