కేంద్ర మంత్రి గిరి రాజ్ సింగ్ (Giriraj Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ రాజకీయాల్లో త్వరలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకో బోతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్(RJD),జనతాదళ్ యునైటెడ్ (JDU)లు త్వరలో విలీనం కాబోతున్నాయని అన్నారు. అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు.
లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్ని జనవరిలోగా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెబుతున్నారని, దానిపై స్పందించాలని కేంద్ర మంత్రిని మీడియా కోరింది. దీనిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ… ఆర్జేడీ, జేడీయూ మధ్య సీట్ల సర్దుబాటు అనే మాట తలెత్తదన్నారు.
తాను ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో వ్యక్తిగత సమీకరణాలను పంచుకుంటూ ఉంటానని చెప్పారు. తన చెవిలో లాలు పలు రహస్య విషయాలను వెల్లడించారని తెలిపారు. వాటిని ఇప్పుడు బహిరంగంగా చెప్పలేనన్నారు. కానీ ఒక విషయం చెబుతానన్నారు. జేడీయూ, ఆర్జేడీలు త్వరలో విలీనం కాబోతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. అదే సమయంలో గిరిరాజ్ సింగ్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆయా సమావేశాలు ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఢిల్లీ నుంచి ఒకే విమానంలో బిహార్ కు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. తన కొడుకును సీఎం చేసే సమయం వచ్చిందని లాలూ తనతో అన్నారని గిరి రాజ్ సింగ్ చెప్పారు. ఆ వ్యాఖ్యలను తర్వాత ఆర్జేడీ ఖండించింది.