అతివేగం ప్రమాదానికి కారణం అని ఎంత ప్రచారం చేసిన సమాజంలో మార్పు లేదు. ఈ చెవితో విని ఇంకో చెవితో వదిలేసే వారే ఎక్కువగా ఉన్నారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం వల్ల రోజురోజుకు ప్రాణాలు కోల్పోయే వారే ఎక్కువ అవుతున్నారు. ప్రస్తుతం కడప (Kadapa) జిల్లాలో ఇలాంటి తప్పిదం వల్లే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పులివెందుల (Pulivendula) నుంచి శ్రీశైలం (Srisailam) వెళుతున్న ఆర్టీసీ బస్సు.. ప్రొద్దుటూరు (Proddatur) నుంచి మల్లెలకు వెళుతున్నఆటో.. ఎదురెదురుగా ఢీ కొనడంతో ఆటో నుజ్జునుజు అయింది. అందులో ప్రయాణిస్తున్న పదిమందిలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలైన ఆరుగురిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇకపోతే కడప జిల్లా ఎర్రగుంట్ల బైపాస్, ఎస్వీ కళ్యాణ మండపం దగ్గర జరిగిన ఈ ప్రమాదంతో రోడ్డు రక్తసిక్తమైంది. క్షతగాత్రులంతా కడప నగరం ఆజాద్ నగర్ కాలనీకి చెందిన వారని, వీరంతా బంధువుల కార్యక్రమానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని గాయపడిన వారిలో ఒకరు తెలిపారు. ఇక సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.