తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకొంది. ఆదివారం తెల్లవారుజూమున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.. సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీని, కారు వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టడంతో.. కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కాగా ఈ దారుణ ఘటన తెన్‌కాసి జిల్లాలో చోటు చేసుకొంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెన్‌కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పులియంగుడికి చెందిన ఆరుగురు స్నేహితులు నిన్న రాత్రి కారులో కుర్దాలం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటుచేసుకొంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కల్కాజీ మందర్‌లో నిన్న రాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగా అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.