దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు జనాన్ని భయకంపితులు చేస్తున్నాయి. ఏటా లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలు ఆయా కుటుంబాలకు కన్నీటిని మిగులుస్తున్నాయి. మరోవైపు గతంతో పోలిస్తే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఒడిశా ప్రమాదంలో 8మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడినట్టు సమాచారం. కెంధూఝర్ (Kendhujhar)లో ఆగి ఉన్న ట్రక్కును ఓ వ్యాన్ ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలుపుతున్నారు.. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని ఘటగావ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఘటగావ్లో ఉన్న తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు వారు వెల్లడించారు.
మరోవైపు తమిళనాడు (Tamil Nadu) సేలం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పికప్ వ్యాన్, ట్రక్కు ఢీ కొనగా ఈ ఘటన జరిగినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
మరోవైపు ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లోని ముజఫర్నగర్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు వెల్లడించిన పోలీసులు.. ఇలా జరగడానికి అతివేగమే కారణమని తెలిపారు.. ఈ ప్రమాదాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.