ఇటీవల కాలంలో యువత తమకు నచ్చిన వారి కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. ప్రేమించిన వారిని మర్చిపోలేక, తల్లిదండ్రుల ప్రేమను వదులుకోలేక సతమతమవుతున్నారు. ఎంత ప్రయత్నించినా కన్నవారు కాదనడంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుని, తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
అయితే, ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా వివాహం చేసుకుని పోలీసులు ఆశ్రయించిన ఓ ప్రేమ జంట మాత్రం రాష్ట్ర మంత్రి రోజాతో ప్రాణహాని ఉందని ఆరోపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఏపీ(AP)లోని చిత్తూరు(Chittoor) జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ఇద్దరి మతాలూ వేరు. దీంతో ప్రవీణ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అంతటితో తల్లిదండ్రులు ఊరుకోలేదు. ప్రవీణకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ప్రవీణ చేసేది లేక ఇంటి నుంచి వెళ్లిపోయింది. జిలానీని స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.
అయితే, తమకు మంత్రి రోజా నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమకు రక్షణ కల్పించకుండా మంత్రి రోజా ఒత్తిడి చేస్తున్నారని ఈ ప్రేమ జంట ఆరోపిస్తోంది. తమకు ఏదైనా జరిగితే రోజానే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేశారు.