చంద్రుడిపై అన్వేషణలో ఉన్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) ఓ భారీ గుంతనుంచి తృటిలో తప్పించుకుంది. తన ముందు కేవలం నాలుగు మీటర్ల దూరంలో ఈ గుంత ఉన్నట్లు గుర్తించింది. సంబంధిత ప్రమాదం సంకేతాలను బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్కు సెకండ్ల వ్యవధిలో పంపించింది. అప్రమత్తం అయిన ఇస్రో (ISRO) సాంకేతిక సిబ్బంది వెంటనే తగు సందేశాలు ఇచ్చి , తమ అంతరిక్ష డ్యూటీలో ఉన్న రోవర్ రూట్ మార్చారు.
వెంటనే ఇది గుంతను తప్పించుకుని నిర్ధేశిత సరికొత్త మార్గంలో తిరిగి అన్వేషణకు వెళ్లిందని ఇస్రో సోమవారం ప్రకటన వెలువరించింది. తన ముందు నాలుగు మీటర్ల వెడల్పుతో ఉన్న చంద్రుడి గుంతను రోవర్ పసికట్టిన విషయాన్ని ఈ ట్విట్టర్ సందేశంలో తెలిపారు. తనకు ఎదురైన గండం దాటుకుని ఇప్పుడు రోవర్ సరైన మార్గంలో ముందుకు సాగుతోందని వివరించారు.
ఈ గుంతలోకి రోవర్ జారి పడి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. రోవర్కు ఎప్పటికప్పుడు సక్రమ మార్గం చూపించే నావిగేషన్ ఏర్పాట్లు ఈ రోవర్కు అమర్చి ఉన్నాయి. దీనితోనే రోవర్ ముప్పు తప్పింది. ఆరు చక్రాల ఈ సౌర శక్తి ఛాలక రోవర్ ఇప్పుడు తనకు ఇంతకు ముందు తెలియచేయని తాజాగా అందిన రూట్లో సాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై ఏఏ మార్గంలో ఏ విధంగా వెళ్లాలనేది ఇస్రో కమాండ్ సెంటర్ ముందుగా నిర్ధేశించి ఉంచింది.
ఈ మేరకు మ్యాప్ అమర్చి ఉంది. అయితే కీలకమైన అడ్డంకి ఏర్పడటంతో ఇప్పుడు తన దిశ మార్చుకుని ముందుకు పట్టువదలకుండా సాగుతోంది. ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాలను, శాస్త్రీయ డేటాను తమ కేంద్రానికి చేరవేస్తున్నట్లు ఇస్రో సంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రయాన్ 3 నుంచి వీడిన ల్యాండర్, రోవర్లు చంద్రుడి పగటికాంతితో రెండు వారాలే జీవం పోసుకుని తమ పనిచేయగల్గుతాయి.
ఈ క్రమంలో రోవర్కు సంబంధించి ప్రతిక్షణం విలువైనదే. దీని నుంచి అందే ప్రతి ఫోటో, డేటా కీలకమే అవుతుంది. చంద్రుడిపై పగటికాంతిని వినియోగించుకుంటూ రోవర్ పయనం సాగుతోంది. ఇప్పటికే నాలుగురోజులు గడిచిన దశలో ఇక రోవర్, ల్యాండర్లకు ఇప్పటి అంచనాల ప్రకారం మరో పదిరోజుల జీవితకాలం మిగిలి ఉంది. దీనిని సక్రమంగా వినియోగించుకుని పంపించే సమాచారం ఇస్రో సాంకేతికతకు అమూల్యం అవుతుంది.