రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల (six guarantees)ను వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ (Congress) ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీ అమలుకు రెడీ అవుతోంది. తాజాగా మహలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
దీనిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే ఈ నెల చివర వరకు రూ. 2500 హామీని అమలు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కన్నా ముందే ఈ హామీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై తాజాగా ఆయన ఆర్థిక శాఖతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తే దానికి ఎంత డబ్బు అవసరం ఉంటుందనే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి పథకాలు అమలులో ఉన్నందున ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక అందించాలని సూచించారు. కర్ణాటకలో మూడున్నర కోట్ల మంది మహిళలకు గాను 1.25 కోట్ల మందికి చెల్లిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆ లెక్కన రాష్ట్రంలో ఇక్కడ ఎంత మందికి ఇవ్వాలి, ఎంత చెల్లించాలనే విషయంపై అధికారులు లెక్కలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక గృహ జ్యోతి పథకానికి ఇప్పటికే భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎవరు అర్హులనే విషయంపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. వాటి ఆదారంగా అర్హులను నిర్ణయించనున్నారు.