మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై మరోసారి మండిపడ్డారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen). ఎల్బీనగర్ పోలీసులు (Police) చేతిలో గాయపడ్డ బాధితురాలు హస్తినపురంలోని శ్యామ్ హాస్పిటల్ (Hospital) లో చికిత్స పొందుతోంది. ఆమెను పరామర్శించారు ఆర్ఎస్పీ(RSP). ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒంటరి మహిళను అక్రమంగా నిర్బంధించి పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన దురదృష్టకరమన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఈ ఘటనను ఖండిస్తోందని తెలిపారు.
ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు అమానవీయమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమని చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేవలం బహుజనుల మీదనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. లిక్కర్ స్కాంలో రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిన కవితను దర్యాప్తు సంస్థల అధికారులు, పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళి విచారించారని గుర్తు చేశారు.
చెయ్యని నేరానికి పోలీసులు స్టేషన్ కి తీసుకొని వెళ్ళి కొట్టడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు ఆర్ఎస్పీ. కూతురు పెళ్లి ఉందని చెప్పినా కూడా కనికరం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగాయని గుర్తుచేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి పరామర్శించి ఒక ప్లాట్ ఇస్తామని చెప్పడం ఏంటని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడో సంఘటన జరిగితే స్పందించే కేసీఆర్, కేటీఆర్ నగరంలో జరిగిన ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు. నగరం నడిబొడ్డున జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే హోంమంత్రి మహమూద్ అలీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.