– ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది
– సనాతన విలువలు, సంస్కారాల ఆధారంగా..
– శాంతి యుతమైన మార్గాన్ని చూపుతుందని ఆశిస్తోంది
– కొన్ని దుష్ట శక్తులు దేశాన్ని గందరగోళం..
– అవినీతిలోకి నెడుతాయి
– విధ్వంసక శక్తులు మాయ చేస్తాయి
– ఉన్నతమైన లక్ష్యాల కోసం పని చేస్తున్నట్టు చెప్పుకుంటాయి
– కానీ, వారి లక్ష్యం శాంతికి భంగం కలిగించడమే
– ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీలో మోహన్ భగవత్
సాంస్కృతిక మార్క్సిస్టులు మీడియా, విద్యా రంగంలో తమ ప్రభావాన్ని ఉపయోగించి దేశ విద్య, సంస్కృతిని నాశనం చేస్తున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మండిపడ్డారు. ఇలాంటి దుష్ట శక్తులు దేశాన్ని గందరగోళం, అవినీతిలోకి నెడుతున్నాయంటూ మండిపడ్డారు.
నాగపూర్ లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంస్కతిక మార్క్సిస్టులను స్వార్థపూరిత శక్తులుగా ఆయన అభివర్ణించారు. ఈ విధ్వంసక శక్తులు తమను తాము పురోగామి శక్తులుగా పేర్కొంటూ ఉన్నతమైన లక్ష్యాల కోసం పని చేస్తున్నట్టు చెప్పుకుంటాయన్నారు. కానీ, వారి నిజమైన లక్ష్యం ప్రపంచంలోని శాంతికి భంగం కలిగించడమేనని తెలిపారు.
వీళ్లు అరాచకాలను ప్రోత్సహిస్తారని ఆరోపించారు. ప్రపంచ దేశాలు భారత దేశాన్ని ఆదర్శంగా తీసుకుని శాంతికి కొత్త మార్గాన్ని చూపుతున్నాయని చెప్పారు మోహన్ భగవత్. ఉగ్రవాదం, దోపిడీ, నిరంకుశత్వం అనే అంశాలు ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు స్వేచ్ఛగా ముందుకు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రపంచం తన అస్పష్టమైన దృక్ఫథంతో ఎదుర్కొనలేదని స్పష్టమైందన్నారు.
ఈ క్రమంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని చెప్పారు. సనాతన విలువలు, సంస్కారాల ఆధారంగా శాంతి యుతమైన మార్గాన్ని తమకు చూపుతుందని ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. హింస, గూండాయిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సమాజంలో ఒక సంఘటిత శక్తి కావాలని తెలిపారు. ప్రభుత్వానికి తగిన మద్దతు అందించాలని ప్రజలను కోరారు.
రెచ్చగొట్టే చర్యలతో సంబంధం లేకుండా ప్రజలు శాంతిభద్రతలను అనుసరించడం, రాజ్యాంగానికి కట్టుబడి, క్రమశిక్షణను పాటించడం ముఖ్యమని వివరించారు. స్వతంత్ర దేశంలో, ఈ ప్రవర్తనను దేశభక్తి వ్యక్తీకరణగా పరిగణిస్తారని అన్నారు. సమాజం ఒక సంఘటిత శక్తిగా మారడమే హింస, గూండాయిజానికి సరైన పరిష్కారమని సూచించారు. మీడియా కూడా సమాజంలో సత్యాన్ని, సామరస్యాన్ని ప్రచారం చేయాలని కోరారు ఆర్ఎస్ఎస్ చీఫ్.