హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు (Rains) పడుతున్నాయి. దీంతో చాలా ఏరియాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా మరమ్మతు పనులు చేయిస్తున్న అధికారులు వాహనాలను అనుమతినిస్తున్నారు. ఈ క్రమంలోనే సుందర్ నగర్ నుంచి సిమ్లా వెళ్తున్న ఆర్టీసీ బస్ (Road Accident).. లోయలోకి పడిపోయింది. మరమ్మతు చేసిన రోడ్డు కుంగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మండి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్ తో కలిసి కొందరు ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
తేలికపాటి వాహనాలకు మాత్రమే ఈ రోడ్డులోకి అనుమతి ఉందని.. బస్ రావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను అధికారులు మూసివేశారు.
మరోవైపు, ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఓ కారు అక్కడే ఉండడంతో అందులో ఉన్న ఐదుగురు యాత్రికులు చనిపోయారు. వీరందరూ కేదార్ నాథ్ యాత్రకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాలను తొలగిస్తుండగా మృతదేహాలు కనిపించినట్లు పేర్కొన్నారు. భారత వాతావరణ సంస్థ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రానున్న 3 రోజులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.