తెలంగాణ (Telangana)లో గొర్రెల పంపిణీ స్కామ్ మరువక ముందే మరో కుంభకోణం వెలుగు చూసింది. రైతుబంధు (Rythu Bandhu), రైతుబీమా డబ్బులు కాజేసిన కేటుగాన్ని సైబరాబాద్ (Cyberabad) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను కొందుర్గ్ మండల వ్యవసాయ అధికారి గోరేటి శ్రీశైలం అని వెల్లడించారు.. నకిలీ పత్రాలతో బీమా పథకాలకు చెందిన నిధులను పక్కదారి పట్టుస్తున్నారనే రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు త్వరగా ఈ కేసులో పురోగతి సాధించారు.
పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి (Avinash Mohanty) మీడియాతో మాట్లాడుతూ ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొందుర్గు మండలంలోని వెంకిర్యాల, తంగళ్ళపల్లి, అగిర్యాల,చిన్న ఎల్కిచేర్ల గ్రామాలకు ఇంచార్జిగా ఉన్న శ్రీశైలం.. బతికున్న20 మంది రైతులు మరణించినట్లు.. నకిలీ పత్రాలు సృష్టించి బీమా డబ్బులు తీసుకున్నారని తెలిపారు. ఇందుకోసం సుమారు రెండు వేల మంది అమాయక రైతుల డేటా ను సేకరించినట్లు గుర్తించామని అన్నారు.
మరోవైపు మరణించిన రైతులకు బీమా కింద తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొందర్గు మండల వ్యవసాయ శాఖలోని అధికారులు ముందుగా తమ పరిధిలోని 20 మంది రైతుల వివరాలను సేకరించారు.. అనంతరం నకిలీ పత్రాలు సృష్టించారు.. రైతు బీమాకు దరఖాస్తు చేసుకొని పెద్ద మొత్తంలో నగదును స్వహా చేసినట్లు పోలీస్ కమిషనర్ వివరించారు.
ఇదిలా ఉండగా రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్ఐసీ చెల్లిస్తుంది. కానీ ఈ విషయంలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరగలేదని.. గోరేటి శ్రీశైలం ప్రభుత్వ అధికారి కావడంతో వాళ్ళకి ఎలాంటి అనుమానం రాలేదని అన్నారు. వీరసామితో ఏడు అకౌంట్ లు జాతీయ బ్యాంకులలో క్రియేట్ చేశాడని, ఏటీఏం, బ్యాంకు పాస్ బుక్ లను తన దగ్గరే పెట్టుకొన్నాడని తెలిపిన సీపీ.. కొనుగోలు చేసిన భూములను ఏసీబీకి అప్పగిస్తామని క్లారిటీ ఇచ్చారు.