భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (S.Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా విషయంలో దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru), దివంగత ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారని చెప్పారు. ఇదేదో తన ఫ్యాంటసీ కాదని అన్నారు. ఈ విషయంలో నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లేఖలు రాసుకున్నారని జైశంకర్ తెలిపారు. ఆ లేఖల ద్వారా చైనా విషయంలో వారు భిన్న అభిప్రాయలను కలిగి ఉన్నట్టు తెలుస్తోందన్నారు.
ఢిల్లీలో ‘వై భారత్ మాటర్స్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ… ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని భారత్ తీసుకోకపోవడాన్ని ప్రస్తావించారు. భద్రతా మండలిలో ముందుగా చైనా చోటు దక్కించుకోనివ్వండని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
భారత ప్రయోజనాలకు నెహ్రూ తొలి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఈ రోజు చైనాతో సంబంధాలపై ఆశలు పెంచుకునే వాళ్లం కాదన్నారు. భద్రతా మండలిలో సభ్యత్వం విషయంలో చైనాకు నెహ్రూ మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 1962లో భారత్ తో చైనా యుద్దానికి దిగినప్పుడు అమెరికా సహాయాన్ని కోరేందుకు నెహ్రూ సంకోచించారని పేర్కొన్నారు.
కానీ పటేల్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారన్నారు. అమెరికా పట్ల మనం అపనమ్మకం ఎందుకు కలిగి ఉన్నామని ఆయన ప్రశ్నించే వారన్నారు. చైనాతో అమెరికన్లు ఎలా వ్యవహరిస్తున్నారనే విషయం గురించి కాకుండా మన సొంత ప్రయోజనాల కోణం నుండి అమెరికాను చూడాలని పటేల్ వ్యాఖ్యలు చేశారని జైశంకర్ వివరించారు.