శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. భక్తుల రద్దీ కారణంగా కొంతమంది అయ్యప్పస్వామిని దర్శించుకోకుండానే దూరం నుంచి మొక్కుకుని వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కేరళ ప్రభుత్వం(Kerala Government) ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ క్రమంలో శబరిమలకు వెళ్లే భక్తులకు స్వల్ప ఊరట లభించింది. భారీగా వస్తున్న భక్తుల దృష్టిలో పెట్టుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(TBD) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చే చిన్నారులు శబరిగిరీశున్ని సులభంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇరుముడులు కట్టుకున్న అయ్యప్ప భక్తులు జనంతో లైన్లు కిక్కిరిసోతుండడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ బాలిక స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనను నేపథ్యంలో పిల్లలకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీబీడీ నిర్ణయించింది.
దీంతో పిల్లలు పొడవైన క్యూలైన్లలో వేచిచూడాల్సిన అవసరం లేకుండాపోయింది. మరోవైపు పిల్లల తల్లిదండ్రులకు ఉపశమనం లభిస్తుందని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు భక్తుల సౌకర్యార్థం శబరిమలలో వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఇదివరకు రెండో విడతలో సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అయ్యప్ప స్వామి దర్శనం కల్పిస్తుండగా ఇప్పుడు మధ్యాహ్నం 3గంటల నుంచే దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా భక్తుల కోసం తాగునీరు, బిస్కెట్లు అందిస్తున్న టీబీడీ చెప్పుకొచ్చింది.