3గంటలు ప్రయాణం.. 3 ఆసుపత్రుల చుట్టూ 70కి.మీలు మేర గర్భిణి నరక యాతన.. చివరకు బిడ్డకు జన్మనిచ్చిన సమయానికి ఆమె గుండె పగిలినంత పనైంది. డబ్బుతెస్తానని ఇంటికి వెళ్లిన భర్త మృతదేహం అదే ఆసుపత్రికి చేరుకుంది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా కారంపూడిలో చోటుచేసుకుంది.
రామాంజిని అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో కుటుంబసభ్యులు కారంపూడి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గురజాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా కాన్పు చేయకపోవడంతో చివరకు 70 కిలోమీటర్లు దాడి నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రసవానికి వైద్యులు ఏర్పాటు చేస్తుండగా భర్త ఆనంద్ ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానంటూ కారంపూడికి బయలుదేరాడు. ఇంతలోనే కారంపూడి నుంచి డబ్బులు తీసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గుంతల రోడ్డులో బైక్‌పై నుంచి పడి భర్త ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. రామాంజిని పాపను ప్రసవించే సమయానికి నరసరావుపేట ఆసుపత్రికి భర్త మృతదేహం వచ్చి చేరింది.
దీంతో ఆ మహిళకు పాప పుట్టిందన్న సంతోషం ఎక్కవ సేపు నిలవలేదు. భర్త మరణవార్త తెలిసి రామాంజిని కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రసవం కోసం 70 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఈ ఘటన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సొంత జిల్లాలో జరగడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.