బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తి గత దూషణలకు దిగడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadhineni Yamini) అన్నారు. ఆమె ఆదివారం విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడారు. వైసీపీ అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని, కొంత మంది పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సొంత జిల్లా కడపకు వెళ్ళినప్పుడు 13 బలగాలను రప్పించుకున్నారని, సీఎంకు ప్రజల అండ ఉంటే ఎందుకు అంతలా బయపడుతున్నారని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేటలో సభ నిర్వహించినప్పుడు ఐదు బలగాలను మాత్రమే పంపించారని, రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, పరిశ్రమలు లేవని, ఉపాధి లేకుండా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని యామిని విమర్శించారు. కేంద్రం పంపిస్తున్న నిధులను పక్క దోవ పట్టిస్తున్నారని, సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
చేసేదంతా చేసి అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలపై ఈసీకి ఫిర్యాదులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పేపర్లల్లో ప్రకటనలకు కోట్లు ఖర్చు చేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్వాడీ లకు న్యాయం చేయలేకపోవటంపై మండిపడ్డారు.
రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగామార్చారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుతిరిగిన వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో కేంద్రం పంపించే నిధులను ప్రజలకు అందించాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. నిజమైన సంక్షేమ పాలన అందించాలంటే ప్రజలు ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.