టీడీపీ-జనసేన(TDP-Janasena) పొత్తులో బలహీనత కనిపిస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)అన్నారు. టీడీపీ-జనసేన జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మరీ దయనీయంగా మారారని.. చంద్రబాబు ఏది పడేస్తే దానికి పవన్ తృప్తి పడటం అలవాటైందంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు జనసేనను మింగాలని అనుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. గతంలో రెండు చోట్ల పవన్ కల్యాణ్ ఓడిపోయారని గుర్తుచేశారు. ఆయనకు రాజకీయ బలం లేదని ఒప్పుకుంటున్నారని విమర్శించారు. అసలు వైసీపీని ఎందుకు గద్దె దించాలని అనుకుంటున్నారో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. పవన్ కల్యాణ్ యుద్ధం ఎవరిపైనో క్లారిటీ తెచ్చుకోవాలన్నారు.
జనసేన పార్టీ టీడీపీ అనుబంధ విభాగంగా మారిందంటూ సెటైర్లు విసిరారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ చిలకపలుకులు పలికితే సరిపోదని, ఆయన గాలితో యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. టీడీపీకి పవన్‌కల్యాణ్ ఉపాధ్యక్షుడు అయితే బాగుంటుందని హితవు పలికారు. పవన్ కల్యాణ్ అభిమానులను, సొంత సామాజిక వర్గం వారిని మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
జనసేన అభ్యర్థులను డిసైడ్ చేసిన చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఆరాటపడుతున్నారని అన్నారు. తాము మాత్రం ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని.. ముందు 24సీట్లకు పవన్ కళ్యాణ్‌ను అభ్యర్థులను ప్రకటించమనండి అంటూ సవాల్ విసిరారు. కుప్పంలో కూడా వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.