ఏపీ సీఎం(AP CM) జగన్(Jagan)పై దాడిని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ఖండించారు. ఆయన తాడేపల్లి(Thadepally)లోని వైఎస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌పై దాడి పూర్తిగా పిరికిపంద చర్యగా అభివర్ణించారు. జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
ఇది పక్కా హత్యాయత్నమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారని, వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారని తెలిపారు. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేదని, పక్కకు గానీ తగిలి ఉంటే ఆయన ప్రాణానికే ప్రమాదం జరిగేదన్నారు. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇది ఆకతాయిల పని కాదని పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదని, ఇది ఎయిర్‌గన్ దాడిలా ఉందని స్పష్టం చేశారు. ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారని, టీడీపీ భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోందన్నారు. చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగినప్పుడు అధికార వైఫల్యమని ఎందుకు అనలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరూ ఇలా మాట్లాడరంటూ సజ్జల మండిపడ్డారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
నటించాల్సిన అవసరం జగన్‌కు లేదని, సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. చంద్రబాబుకే నటన అలవాటు అని విమర్శించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయని సజ్జల చెప్పుకొచ్చారు. సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగిందని చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ యాత్ర సూపర్ సక్సెస్ కావడం వల్లే చంద్రబాబు సహించలేకపోయారని ఆరోపించారు. రాజకీయ సిద్దాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ఉన్నాయని వ్యాఖ్యానించారు.