బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ముంబై పోలీసులు(Mumbai Police) ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
ముంబైలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ విషయమై తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. క్రైం బ్రాంచీతో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఫోరెన్సిక్ నిపుణుల బృందం సైతం అక్కడికి చేరుకుంది. గతేడాది మార్చిలో గతేడాది ఏప్రిల్ 11న సల్మాన్‌కు చంపుతామంటూ ఆయన ఆఫీసుకు ఈ-మెయిల్స్ అందిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపి గ్యాంగ్‌స్టర్‌లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. యూకేలో ఉంటున్న భారతీయ యువకుడు ఆ పని చేసినట్లు గుర్తించారు.
అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. అప్పటి నుంచి సల్మాన్ ఇంటి వద్ద వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. తాజాగా సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరగడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.