మేడారం మహాజాతర(Medaram Maha Jathara) ముగిసి నెల రోజులు గడిచింది. అయినా సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) ఆలయానికి భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడంలేదు. ఆదివారం సెలవు రోజు కావడంతో వనదేవత దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
మేడారం జాతర సమయంలో ప్రభుత్వం ఆలయ ప్రాంగణంలో జంతు బలికి అనుమతించలేదు. అయితే, జాతర ముగియడంతో ఇవాళ(ఆదివారం) గొర్రెలు, బెల్లంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ములుగు జిల్లాలో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఆలయ ప్రాంగణమంతా అమ్మవార్ల నామస్మరణతో మరుమోగింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బెల్లం(బంగారం) సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు గట్టమ్మను తప్పక దర్శించుకోవడం ఆనవాయితీ. గట్టమ్మ వద్ద ఆగి దర్శనం చేసుకోకపోతే సమ్మక్క సారలమ్మ ప్రార్థనలు చెల్లవని నమ్మకం.
ఉదయాన్నే గుడిసెలు వేసి ముంగిల వద్ద రంగవల్లులను అందంగా అలంకరించారు. వనదేవతలకు బెల్లం, చీరలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పరవశిస్తు అమ్మవార్ల ఆశీస్సుల కోసం భక్తులు పూనకాలతో గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో మేడారం జనసందోహంతో కిటకిటలాడింది. ఆధ్యాత్మిక భక్తితో మార్మోగింది.