రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టడానికి పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అయినా రోజూ ఎక్కడోచోట మత్తు పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో నిందితులను అరెస్టు చేయడంతో పాటు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతారు.
గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిందితుల ద్వారా తెలుసుకుని శిక్ష పడేలా చూస్తారు. అయితే, ఓ చోట పోలీసులు సీజ్ చేసిన 70కిలోల గంజాయి మాయమైంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా(Jagtial District) సారంగాపూర్ పోలీస్ స్టేషన్(Sarangapur Police Station) పరిధిలో 2023 ఫిబ్రవరి 1వ తేదీన వాహనాల తనిఖీ చేపట్టారు పోలీసులు.
ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన ఓ అంబులెన్స్ అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని పోలీసులు తనిఖీ చేయగా 70కిలోల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని అదే అంబులెన్స్‌లో భద్రపరిచి సారంగాపూర్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ క్వార్డర్స్ పక్కన పార్కింగ్ చేశారు.
సోమవారం ఉదయం పోలీసులు ఆ అంబులెన్స్‌లో పరిశీలించగా సీజ్ చేసిన గంజాయి కనిపించలేదు. అంబులెన్స్ అద్దాలు పగిలి ఉండటంతో గంజాయి చోరీ అయినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ వెంటనే డాగ్ స్వ్కాడ్ రంగంలోకి దిగింది. మరోవైపు సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తి విచారణ చేపడుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.