గ్రామాలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. గ్రామస్థాయిలో జరిగే అభివృద్ధి పైనే అందరి దృష్టి ఉంటుంది. అయితే.. తెలంగాణ (Telangana) లో ప్రగతి మాటున ప్రజాప్రతినిధులకు తిప్పలు తప్పడం లేదు. చాలాచోట్ల సర్పంచుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. నిధులు విడుదల కాక.. విడుదలైన నిధులకు సంబంధించిన చెక్కులు పాస్ అవ్వక.. తెచ్చిన అప్పులు కుప్పలుగా పేరుకుపోతుండడంతో చితికిపోతున్నారు కొందరు సర్పంచులు. కరీంనగర్ (Karimnagar) జిల్లాలో అయితే ఓ సర్పంచ్ ఆటో నడిపి తన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు.
గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి సర్పంచ్ గా ఉన్నాడు మేఘరాజ్. ఈయనకు గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు రూ.16 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. వైకుంఠధామం నిర్మించిన బిల్లు రూ.5 లక్షలు రావాలి. తాము అప్పులు చేసి పనులు చేయగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సర్పంచ్ మేఘరాజ్.
చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ గతంలో మండల పరిషత్ సమావేశంలో అధికారుల ముందు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపాడు. ఇప్పుడు ఎంపీడీవో కార్యాలయం ముందు ఆటో నడిపాడు. చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలయి.. ఆటోలో ప్యాసింజర్లను దింపుతూ వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఇప్పటికైనా ప్రభుత్వం తనతోపాటు గ్రామాలలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు మేఘరాజ్.
మహిళా వీఆర్ఏ ఆత్మహత్య
జనగామ జిల్లాలో మహిళా వీఆర్ఏ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పని ఒత్తిడి తాళలేకనే ఇలా చేసిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇటీవల వీఆర్ఏలను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీలు చేసింది. ఈ క్రమంలో రఘునాథపల్లి మండలానికి చెందిన వీఆర్ఏ సంధ్యా కిరణ్ ను లింగాల గణపురం నుండి హైదరాబాద్ లోని బండ్లగూడెంకు జూనియర్ అసిస్టెంట్ గా పంపింది. ఈ క్రమంలోనే పని ఒత్తిడి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.