Telugu News » IT employees: మళ్లీ రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులు..అనుమతి లేదన్న పోలీసులు!

IT employees: మళ్లీ రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులు..అనుమతి లేదన్న పోలీసులు!

ఐటీ అంటే బాబు.. బాబు అంటే ఐటీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు

by Sai
it employees protesting chandrababu arrest

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(CBN) అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు (IT Employees) ఆందోళన నిర్వహించారు. ‘చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చెందింది. ఆయన వల్లే మాకు ఉపాధి అవకాశాలు వచ్చాయి. మా జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటాం’ అని ఉద్యోగులు పేర్కొన్నారు.

it employees protesting chandrababu arrest

చంద్రబాబును అవినీతి ఆరోపణలపై అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి ఆయణ్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు బుధవారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు.

‘ఐటీ అంటే బాబు.. బాబు అంటే ఐటీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అమలు చేసిన ఐటీ విధానాలను విదేశాలు సైతం స్ఫూర్తిగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయని టీడీపీ అభిమాని అయిన ఒక యువతి అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కూకట్‌పల్లిలోనూ ఐటీ ఉద్యోగులు, సెటిలర్లు ఆందోళన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీ సర్కిల్‌లో ఉద్యోగులు ఈ ఆందోళన నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

You may also like

Leave a Comment