నేటి కాలంలో పిల్లల ఆలోచనలో ఊహించని విధంగా మార్పులు జరగడం గమనించే ఉంటారు.. మారుతోన్న కాలానికి అనుగుణంగా పిల్లల ప్రవర్తన ఉంటుందని నిపుణులు తెలియచేస్తున్నా.. కొందరు పిల్లలైతే మరీ మొండిగా ప్రవర్తించడం కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల్లో కొందరైతే చదువు అంటే ముఖం చాటేస్తారు.. తల్లిదండ్రులు కూడా చెప్పి చెప్పి విసుగుపుట్టి స్కూళ్లకు పంపించడం మానుకుంటారు..
ఇప్పటికే మన విద్యా వ్యవస్థ (Education system)లో చాలా మార్పులు జరగాలని కొందరు మేధావులు పలుమార్లు వెల్లడించడం తెలిసిందే.. అయినా వ్యవస్థ మారదు.. ఇక ప్రైవేట్ స్కూళ్ళు అయితే.. ఫీజుల పేరుతో డబ్బులు దండుకోవడం మీద పెట్టిన శ్రద్ద.. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో చూపించక పోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా పిల్లలు స్కూళ్లకు వెళ్లకున్నా పెద్దగా పట్టించుకొనే వారు లేరు.. అంతగాకపోతే ఒక్క సారి గట్టిగా మందలించి వదిలేస్తారు.. ఇంతకు మించి మన దగ్గర పెద్దగా ఏం జరగదు. కానీ ఒక దేశంలో పిల్లలు స్కూల్‌కు వెళ్లకపోతే పేరెంట్స్‌ను జైలుకు పంపుతారు తెలుసా..? ఇంత కఠినమైన రూల్స్ (Strict Rules) ఏంటని ఆశ్చర్యపోకండి..
ఇక సౌదీ అరేబియా (Saudi Arabia)లో ఒక ప్రత్యేక నియమం ఉంది. ఒక విద్యార్థి 20 రోజులు పాఠశాలకు హాజరు కాకపోతే రాష్ట్ర బాలల రక్షణ చట్టం ప్రకారం.. విద్యార్థి తల్లిదండ్రులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి పంపడం పాఠశాలల బాధ్యత. ఈ ప్రత్యేక నిబంధన ప్రకారం, విద్యార్థి 3 రోజులు సెలవు తీసుకుంటే ముందుగానే హెచ్చరిస్తారు. తరువాత, విద్యార్థి 5 రోజుల సెలవు తీసుకుంటే రెండవ హెచ్చరిక జారీ చేస్తారు.
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేస్తారు. 10 రోజులు గైర్హాజరైతే, మూడవ వార్నింగ్ తో పాటుగా తల్లిదండ్రులను పిలుస్తారు.. కాని 15 రోజుల తర్వాత, ఆ విద్యార్థిని మరొక పాఠశాలకు బదిలీ చేస్తారు. 20 రోజుల తర్వాత, విద్యా శాఖ బాలల సంరక్షణ చట్టంలోని నిబంధనలను అమలు చేస్తుంది. అప్పుడు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా 20 రోజులు విద్యార్థులు పాఠశాలకు వెళ్లకపోతే వారి తల్లిదండ్రులను (Parents) జైలు (Jail)కు పంపుతారు.