తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు విపరీత నష్టాన్ని మిగిల్చాయని, దీనిపై చర్చ జరగాలని కోరుతూ లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మాన నోటీసు నిచ్చారు. తెలంగాణాలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలమయ్యాయని,బాధితులను వెంటనే ఆదుకోవాల్సి ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ వంటి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించిందని, అయితే ఈ జిల్లాలకు కేంద్ర సాయం తక్షణమే అందాల్సి ఉందన్నారు. లక్షల ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోయారన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో మరిన్ని వరద తాకిడి ప్రాంతాలను సందర్శించాలని, తమ నివేదికను కేంద్రానికి వెంటనే అందించాలని ఆయన కోరారు.
సేవ్ మణిపూర్.. బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
మణిపూర్ అంశంపై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం ఉదయం ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. సేవ్ మణిపూర్ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకున్న వీరు .. ఈ అంశంపై పార్లమెంటులో వెంటనే చర్చ జరగాలని డిమాండు చేశారు. మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోడీ తక్షణమే సభలో ప్రకటన చేయాలని నినాదాలు చేశారు.
అలాగే వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెనక్కి తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ బిల్లును నిన్నమూజువాణీ ఓటుతో లోక్ సభ ఆమోదించింది. అయితే విపక్షాలు వాకౌట్ చేశాయి.
ఇక మణిపూర్ అంశం శుక్రవారం కూడా పార్లమెంటును కుదిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 8, 9, 10 తేదీల్లో దీనిపై పార్లమెంటులో చర్చ జరగనుంది. 10 న చర్చకు ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. అయితే ఈ లోగా ఆయన సభకు వచ్చి ఓ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.