Telugu News » Seethakka : సావిత్రి బాయి పూలే వేసిన విద్యా పునాదులే మనకు ఆదర్శ ప్రాయం…..!

Seethakka : సావిత్రి బాయి పూలే వేసిన విద్యా పునాదులే మనకు ఆదర్శ ప్రాయం…..!

సాంకేతికంగా మహిళలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. వాళ్లు ఇంకా ఎన్నో విజయాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

by Ramu
savitribai phule 193 birth anniversary celebration in ravindra bharathi

సావిత్రి బాయి పూలే (Savitribai Phule) వేసిన విద్యా పునాదులే నేడు మనకు ఆదర్శ ప్రాయమని మంత్రి ధనసరి సీతక్క ( Seethakka) అన్నారు. సాంకేతికంగా మహిళలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. వాళ్లు ఇంకా ఎన్నో విజయాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల్లో పోరాడే శక్తితో పాటు, సమస్యలను ఎదుర్కొనే శక్తి కూడా పెరగటం ఆహ్వానించదగ్గ పరిణామని వెల్లడించారు.

savitribai phule 193 birth anniversary celebration in ravindra bharathi

రవీంద్ర భారతిలో రాష్ట్ర బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 193వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ…. మహిళలు చదుకునేందుకు సావిత్రి బాయి పూలే తొలి అడుగు వేశారని తెలిపారు. తన లాంటి ఎంతో మందికి సావిత్రి బాయి పూలే ఆదర్శమని వెల్లడించారు.

సమాజాన్ని సంస్కరించేందుకు చదువు, విజ్ఞానం కావాలని సావిత్రి బాయి పూలేను జ్యోతిరావు పూలే ప్రోత్సహించారని అన్నారు. జ్యోతిరావు పూలేను స్పూర్తిగా తీసుకుని నేటి సమాజంలో భర్తలు కూడా వారి భార్యలను ప్రోత్సహించాలని సూచించారు. కుల వివక్ష, అణిచివేత నుండి వచ్చిన వెలుగు రేఖ సావిత్రి బాయి పూలే అంటూ కొనియాడారు.

తాను ఒక నిత్యా విద్యార్ధినని పేర్కొన్నారు. విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత విద్య అనేది ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుందని సావిత్రి బాయి పూలే స్పూర్తితో ఉన్నత చదువులు చదివానని వెల్లడించారు. సావిత్రి పూలే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. నేటి సమాజంలో ఇంకా కుల వివక్ష ఉండటం బాధాకరమన్నారు.

కుల వివక్షను నిర్ములించాలంటే ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వివక్ష వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. తన దృష్టిలో రాజకీయం అంటే కేవలం సేవ చేయడం మాత్రమేనని చెప్పారు. సేవ చేయడంలో ఉన్న తృప్తి అజమాయిషీ చేయడంలో ఉండదని వివరించారు. ప్రతి ఇంట్లో ఆడవాళ్లు విద్యావంతులు కావాలని.. అప్పుడే సమాజం బాగుంటుందన్నారు.

You may also like

Leave a Comment