SC : మధురలోని కృష్ణజన్మభూమి వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలని సూచిస్తూ 10 రోజులపాటు డిమాలిషన్ డ్రైవ్ ఆపి వేయాలని తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. శ్రీకృష్ణజన్మభూమి సమీపంలోని నాయీ బస్తీలో గల అక్రమ నిర్మాణాలను రైల్వే శాఖ తొలగిస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటూ 66 ఏళ్ళ యాకుబ్ షా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ని కోర్టు విచారించింది.
ఈ ప్రాంతంలో తమ కుటుంబాలు 1880 నుంచే నివసిస్తున్నాయని, రైల్వే శాఖ ఈ నెల 9 నుంచి డిమాలిషన్ డ్రైవ్ చేబట్టిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన తరఫున లాయర్ ఈ కేసులో వాదిస్తూ ఇప్పటికే వంద ఇళ్లను కూలగొట్టారని, నిజానికి యూపీ కోర్టులు ఈ కేసును క్లోజ్ చేసినప్పటికీ.. రైల్వే శాఖ మాత్రం కూల్చివేతలను ఆపలేదని అన్నారు.
70-80 ఇళ్ళు మాత్రమే ఇప్పుడు అక్కడ ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఇక్కడ నివసిస్తున్న వారు తామెక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వంద ఏళ్ళ క్రితం నుంచే తమ పూర్వీకులు ఇక్కడ ఇళ్ళునిర్మించుకున్నారని చెబుతున్నారని ఆ లాయర్ పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ భట్టీలతో కూడిన బెంచ్.. కేంద్రానికి, ఇతరులకు నోటీసు జారీ చేసింది. 10 రోజుల తరువాత ఈ కేసును లిస్ట్ లో పెట్టాలని రిజిస్ట్రీని ఆదేశించింది.