పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఈ కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చడంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో గరిష్ట శిక్ష విధింపునకు ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఈ కేసులో రాహుల్ దాఖలు చేసిన అఫిడవిట్ ను అంగీకరించిన కోర్టు.. ఇకపై తన వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని సూచించింది. జస్టిస్ బీఆర్. గవాయ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ.. తుది తీర్పు వెలువరించేవరకు ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తున్నామని స్పష్టం చేసింది.
రాహుల్ తరఫున వాదించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి .. ఇక ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తమ క్లయింటు సభకు హాజరవుతారని పేర్కొన్నారు. రాహుల్ కేసులో సుప్రీంకోర్టు ఆయన దోషిత్వంపై స్టే ఇవ్వడంపట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజావాణిని ఏ శక్తీ నిలువరించజాలదని పార్టీ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. ఏ నాటికైనా సత్యమే గెలుస్తుందని, రాహుల్ పై పన్నిన కుట్ర విఫలమైందని పేర్కొన్నారు.
తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తాను వెంటనే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో మాట్లాడుతానని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. కాగా కోర్టు తీర్పుపై ఢిల్లీ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల గరిష్ట శిక్షను నిలుపుదల చేయాలని రాహుల్ అభ్యర్థించారు. తమ క్లయింటు నేరస్థుడు కాదని, ఆయనపై గతంలో అనేక కేసులు వేసినప్పటికీ ఏ కేసులోనూ శిక్ష పడలేదని రాహుల్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తెచ్చారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమన్నారు. కర్ణాటక లోని కోలార్ లో లోగడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్.. ప్రధాని మోడీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో కేసు వేయగా .. ఆ కోర్టు రాహుల్ ని దోషిగా పేర్కొంది. దాన్ని ఆయన మొదట గుజరాత్ హైకోర్టులో సవాలు చేయగా ఆ కోర్టు కూడా ట్రయల్ కోర్టు ఉత్తర్వులు సక్రమమేనని వెల్లడించింది. వీటిని కూడా సవాలు చేస్తూ రాహుల్. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.