కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogi Raj) చెక్కిన ‘రామ్ లల్లా’ (Ram Lalla) విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ కోసం ఫైనలైజ్ చేశారు. మొత్తం ముగ్గురు శిల్పులు మూడు విగ్రహాలను చెక్కగా అందులో ట్రస్టు సభ్యులు యోగి రాజ్ చెక్కిన విగ్రహం వైపే మొగ్గు చూపారు. ఆ విగ్రహానికి జనవరి 22న ప్రాణప్రతిష్ట నిర్వహించనున్నట్టు ట్రస్టు సభ్యులు వెల్లడించారు.
ప్రాణ ప్రతిష్ట కోసం అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇవి తమ కుటుంబానికి అత్యంత సంతోషకరమైన క్షణాలు అని వెల్లడించారు. అరుణ్ చాలా సాధారణమైన వ్యక్తి అని తెలిపారు. అత్యంత ఆసక్తితో రామ్ లల్లా విగ్రహాన్ని అరుణ్ చెక్కారని పేర్కొన్నారు. పగలు రాత్రి శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారని చెప్పారు.
కర్ణాటక నుంచి తీసుకు వచ్చిన కృష్ణ శిలపై అయిదేండ్ల బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారని వివరించారు. రామ్ లల్లా విగ్రహాన్ని అరుణ్ చెక్కడం తాను చూడాలనుకున్నానని అన్నారు. కానీ చివరి రోజు తన పని వద్దకు తీసుకు వెళ్తానని చెప్పాడన్నారు. శిల్పం ప్రతిష్టించిన రోజు అక్కడకు వెళ్తానన్నారు. అరుణ్ తండ్రి బ్రతికి ఉంటే ఇప్పుడు చాలా సంతోషించే వారన్నారు. తన కుమారుడు చెక్కిన రాముడి శిల్పాన్ని ప్రపంచం అంతా చూస్తోందన్నారు. ఇంతకన్నా తమకు సంతోషం ఏముంటుందన్నారు.
తన భర్తను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ సమయంలో తనకు మాటలు రావడం లేదన్నారు. ఇది తమకు చాలా గొప్ప సమయమని మురిసిపోయారు. తన భర్త విగ్రహం గురించి తనకు చెప్పలేదన్నారు. మీడియా ద్వారా తనకు విషయం తెలిసిందన్నారు. తన దృష్టిని పూర్తిగా పెట్టి 100 శాతం నిబద్దతతో విగ్రహం కోసం పని చేశారని వివరించారు. విగ్రహం తయారీకి ముందు ఆయన చాలా రీసెర్చ్ చేశారన్నారు.
అరుణ్ సోదరి చేతన మాట్లాడుతూ….. ‘ప్రపంచంలో ఇలాంటి సంతోషాన్ని ఎవరూ అనుభవించలేదు. అరుణ్ ఎంబీఏ పూర్తి చేశారు. కానీ డ్రాయింగ్, శిల్పకళపై పని చేయాలన్నది ఆయన కళ. చిన్న తనంలో అరుణ్ మా తండ్రికి సహాయంగా ఉండే వారు. చిన్నప్పటి నుంచి ఆయనకు శిల్ప కళ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తమకు అవకాశం వస్తే తాము కూడా ఆ అద్బుతాన్ని వీక్షిస్తామన్నారు.