తెలంగాణ శాసనసభ ఎన్నికల(Telangana assembly elections) నేపథ్యంలో నగదు, ఆభరణాలు, మద్యం భారీగా పట్టుబడుతోంది. ఎన్నికల షెడ్యూల్(election schedule) వచ్చిన పది రోజుల్లోనే పట్టుబడుతున్న సొత్తు పాత రికార్డులను చెరిపివేసింది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడిన మొత్తాన్నీ దాటేయడం ఇందులో గమనించాల్సిన విషయం.
ఈనెల 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు, మద్యం విలువ రూ.165కోట్లను మార్కును దాటిందంటే ఎన్నికల వేళ ఏస్థాయిలో నోట్ల కట్టలు, బంగారం తరలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తనిఖీల్లో నగదు, బంగారంతో పాటు గంజాయి సైతం పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రహదారులపై వచ్చీపోయే వాహనాలన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో పాటు బంగారం ఉన్నవారి వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు లేకుంటే సీజ్ చేసేస్తున్నారు. ఈ నిబంధనలను అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుండం చూసి సామాన్యులు సైతం నోరు వెళ్లబెడుతున్నారు.
నగదుతో పాటు అన్ని వస్తువులను కలిపి ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు ఏకంగా రూ.165కోట్ల 81లక్షల 4వేల 699. అదీ కేవలం 10రోజుల్లోనే. ఈ మొత్తం గత అసెంబ్లీ ఎన్నికల్లో బడిన నగదుకంటే చాలా ఎక్కువ. 2018 ఎన్నికల సమయంలో మొత్తం రూ.137కోట్ల 97లక్షల నగదు పట్టుబడింది.