ఇండియా (India), చైనా (China) సరిహద్దు, తూర్పు సెక్టార్లో నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను నేడు ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. దీనితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఐదేళ్లలో మేము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ చేయడానికి 20ఏళ్లు పడుతుందని తెలిపారు. మోడీ గ్యారంటీ ఎలా పని చేస్తుందో మొత్తం ఈశాన్య రాష్ట్రాలు గమిస్తున్నాయన్నారు.. నేను దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను, అందుకే విపక్ష ఇండియా కూటమి నాయకులు నాపై దాడి చేస్తున్నారని ప్రధాని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
మరోవైపు ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్‌గా గుర్తింపు పొందిన సేలా టన్నెల్ విశేషాలు గమనిస్తే.. సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య సేలా టన్నెల్‌ను నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్-తవాంగ్ (BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. కాగా సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి.
టన్నెల్-1 సింగిల్ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
అదీగాక ఈ టన్నెల్ తో తవాంగ్-దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలుస్తోంది. మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ టన్నెల్లో వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని ప్రధాని మోడీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది.
అరుణాచల్‌ప్రదేశ్ (Arunachal Pradesh), తవాంగ్ చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకొనే అవకాశం కలిగింది. చైనా (China) సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి దారులు మూసుకు పోయాయని తెలుస్తోంది..