ఐసీసీ(ICC) వన్డే ప్రపంచకప్ 2023(World Cup-2023)లో సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ (IND-NZ )జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్ గెలిచి టీమిండియా సెమీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే తపనతో ఉంది. ఈ నేపథ్యంలో ముంబై వాంఖడే స్టేడియానికి బెదిరింపు మెసేజ్ కలకలం రేపుతోంది.
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరిగే సమయంలో ఘోరం జరుగుతుందని తమకు Xలో మెసేజ్ వచ్చిందని ముంబై పోలీసులు వెల్లడించారు. ‘గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. వాంఖడే స్టేడియంలో ఘోరం జరుగుతుందని చెప్పాడు. తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్స్, బుల్లెట్లు చూపించాడు. భద్రత కట్టుదిట్టం చేశాం’ అని పోలీసులు తెలిపారు.
వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌కు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంపై దాడి చేస్తామంటూ అప్పుడు ఓ ఈ-మెయిల్ వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.. ఆపై నిందితుడిని అరెస్టు చేశారు.
ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మైదానంలో మ్యాచ్ ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులు కాస్త బెదిరిపోతున్నారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ వాయిస్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి ఓ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.