సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Lakshminarayan).. జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నూతన పార్టీని ప్రకటించిన అనంతరం.. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీని ప్రజల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. అయితే జేడీ కొత్త పార్టీపై.. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధినేత కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భారత్ నేషనల్ పార్టీని ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఆర్‌ఎస్‌ఎస్ సపోర్టర్ అంటూ ఆరోపణలు చేసిన కేఏ పాల్ .. ఏపీకి ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని అన్నారు. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ అని తెలిపిన జేడీ.. వంద కోట్లకు, వెయ్యి కోట్లకు అమ్ముడు పోవడమా అంటూ మండిపడ్డారు. ఎంతో ఉత్సాహంగా పార్టీ స్థాపించిన జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీని మూసేసారని, తెలంగాణకి న్యాయం చేస్తా అంటూ వెళ్ళిన షర్మిల సైతం పార్టీ మూసేసారని కేఏ పాల్ వ్యంగ్యాస్త్రాలు వదిలారు.
ఎందరో ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రజాశాంతి పార్టీలో చేరారన్న కేఏ పాల్.. త్వరలో ప్రజాశాంతి పార్టీకి గుర్తు రానుందని వెల్లడించారు. మరోవైపు టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో.. తనను విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షా కోరారని.. కానీ తాను వెళ్లలేదని తెలిపిన కేఏ పాల్.. మరో షాకిచ్చారు..
లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ రూ.1000 కోట్లు ఇచ్చిందని కేఏ పాల్ ఆరోపించారు. కాగా ఎప్పుడు ఎవరో ఒకరి మీద విమర్శలు చేయనిదే పాల్ నిదురపోడనే అపవాదు మూటగట్టుకొన్న ఈయన తాజాగా లక్ష్మీనారాయణపై చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చకి దారితీసాయి..