ప్రధాని నరేంద్ర మోడీ (Modi) నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. అయితే కొత్త పార్లమెంట్( New Parliament ) భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం జరిగిన వర్షాకాల సమావేశాలే కొత్త భవనం నుంచి కొనసాగుతాయని చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఓ పెద్ద అప్డేట్ (Update)వచ్చింది. ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంటు నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. తర్వాత కొత్త పార్లమెంట్ భవనానికి మార్చనున్నట్లు తెలిపాయి.
సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి(Ganesh Chaturdhi) సందర్భంగా కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభ సమావేశాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు పాత పార్లమెంట్ హౌస్లో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, పెద్ద నాయకులు, వారి గొప్ప పనులు గుర్తు చేసుకుంటారట. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ నిర్మాణం, పార్లమెంట్ చరిత్ర, కొత్త పార్లమెంట్ భవనం ఆవశ్యకత తదితర అంశాలపై ఓ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ప్రత్యేక సమావేశాల రెండో రోజే కొత్త పార్లమెంట్ భవనానికి మారనున్నారు. చంద్రయాన్-3, జీ20 విజయాలపై ప్రతిపాదనలు సమర్పించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం రెండు ముఖ్యమైన బిల్లులను కూడా తీసుకురానున్నారు. ఈ బిల్లులు ఎన్నికల సంస్కరణలకు సంబంధించినవి కావచ్చని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే ఈ బిల్లులు ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఏడాది మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కొత్త భవనంలో పనులు ప్రారంభం కావడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. పార్లమెంటు కొత్త భవనం అత్యాధునిక సౌకర్యాలు, వనరులతో ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి 862 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేశారు.