స్వామియే శరణం అయప్ప శరణు ఘోషతో శబరిమల గిరులు(Shabarimala Hills) మార్మోగుతున్నాయి. మకరజ్యోతి(Makarajyothi) దర్శనానికి ఇంకా కొద్ది గంటలే సమయం మిగిలుంది. అయ్పప్పస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.
ఎప్పటిలాగే అధికారులు తగు ఏర్పాట్లను పూర్తి చేశారు. అయ్యప్ప సన్నిధానంతో పాటు జ్యోతి దర్శనం కనిపించే పంపానది, పులిమేడు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నియమ నిష్టలతో 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు మకర జ్యోతిని చూడడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. శబరిమల పొన్నాంబలమేడుపై కనిపించే మకరజ్యోతి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్టాప్, టోల్ ప్లాజా సహా మొత్తం పది పాయింట్ల దగ్గర జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.
మకరవిళక్కుకు రోజుకు 80 వేల మంది భక్తులకు ఆన్లైన్ స్లాట్లను విడుదల చేశారు. ఇటీవలి వరకూ 20వేల మందికి స్పాట్ స్లాట్ ఇచ్చినా మకర జ్యోతి రద్దీ దృష్ట్యా రద్దు చేశారు. 4 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనానికి తరలివస్తారని అంచనా వేస్తున్న అధికారులు వ్యూహాత్మక ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.