కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత షబ్బీర్ (Shabbir Ali) ఆలీ ఆసక్తికర నిర్ణయం తీసుకొన్నారు. కామారెడ్డి (Kamareddy) నుంచి బీఆర్ఎస్ (BRS) తరఫున సీఎం కేసీఆర్ (CM KCR) బరిలో నిలిచిన నేపధ్యంలో, కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థిగా సీఎం కేసీఆర్ ఉండడంతో ఫలితాలు భిన్నంగా వస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆందోళనగా ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు గత మూడున్నర దశాబ్దాలుగా షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకొని ఉన్నారు. తొలిసారి కామారెడ్డి ఎమ్మెల్యేగా1989లో గెలిచారు. చెన్నారెడ్డి కేబినెట్లో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇంచార్జ్ మంత్రిగా పని చేశారు. 1994, 1999లో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచి మరోసారి గెలిచారు. వైఎస్ కేబినెట్లో విద్యుత్, బొగ్గు, మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పని చేశారు.
2009లో కామారెడ్డి నుంచి ఓడిపోయిన షబ్బీర్ అలీ, 2010లో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. 2014, 2018లలోను ఓడిపోయారు. ఇలా వరుసగా మూడుసార్లు ఓడిపోయిన పరిస్థితిలో మరోసారి ఓటమి పాలైతే పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మొదటి విడుత జాబితాలో షబ్బీర్ అలీ లేరని అంటున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు షబ్బీర్ ఆలీ. ఈ క్రమంలో అదే ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్న.. మదన్ మోహన్ రావు ను కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం.. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన మదన్ మోహన్ రావు పార్టీ మాట వింటారా లేదా అనేది చూడాలి. మరోవైపు సీనియర్ నేత షబ్బీర్ ఆలీ నిర్ణయంపై కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.