దేశానికి స్వాతంత్ర్యం(Freedom Fight) కోసం ఉద్యమం నడిపిన వారిలో అందరికీ మహత్మా గాంధీజీ(Mahatma Gandi) పేరు మొదట గుర్తొస్తుంది. కానీ, ఆయన కంటే ముందు చాలా మంది స్వాతంత్ర్య కారులు ఉద్యమాలు నడిపారు.మాతృభూమిని బ్రిటీష్ వారి చెర నుంచి విడిపించేందుకు కొత్త ఉద్యమాలకు ఊపిరిపోశారు. అదేవిధంగా ఒక చేతితో స్వాతంత్ర్య కాంక్షతో జెండా పట్టుకుని మరొక చేతితో బ్రిటీష్ వారితో యుద్ధం చేసింది ఓ ధీర వనిత. ఆమె మరెవరో కాదు ‘షహీద్ భోగేశ్వరి’(Shaheed Bogeshwari).
షహీద్ భోగేశ్వరి అస్సాంలోని నాగావ్ జిల్లాలో జన్మించింది. భోగేశ్వర్ ఫుకాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఆరుగురు కుమారులు. భోగేశ్వరి ఎనిమిది మంది పిల్లల తల్లి మాత్రమే కాకుండా ఓ సాధారణ గృహిణి. అయినప్పటికీ, షాహీద్ బోగేశ్వరి ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.అస్సాంలోని నాగావ్ జిల్లాలోని బెర్హంపూర్, బాబాజియా, బర్పూజియా ప్రాంతాల్లో చురుకుగా పనిచేసింది.
భారత జాతీయ కాంగ్రెస్ ఆఫీసులను ఏర్పాటు చేయడంలో ముఖ్యభూమిక పోషించింది. 1930లో ఆమె బ్రిటీష్ అధికారులకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన చర్యగా అహింసాత్మక మార్చ్‌లో పాల్గొనగా..బ్రిటీష్ అధికారులు పికెటింగ్‌లో భాగంగా ఆమెను అరెస్టు చేశారు. షహీద్ భోగేశ్వరి తరచుగా అహింసా నిరసన మార్చ్‌లో పాల్గొనేవారు. 1942లో బెర్హంపూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని బ్రిటీష్ అధికారులు సీజ్ చేసి మూసివేయగా.. అందుకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కవాతులో ఆమె తన కుమారులతో కలిసి పాల్గొని కాంగ్రెస్ కార్యాలయాన్ని తిరిగి విజయవంతంగా తెరిచారు.
2 రోజుల తర్వాత కార్యాలయం పున:ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం ఈ కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపారు. ఆ సమయంలో షహీద్ భోగేశ్వరి, ఆమె కూతురు రత్నమాల చుట్టుపక్కల గ్రామస్తులు చాలా మందితో వందేమాతరం నినాదాలు చేస్తున్నారు. ఆ గుంపునకు భోగేశ్వరి నాయకత్వం వహిస్తుండగా.. పోలీసులు ఆ సమూహాన్ని బలవంతంగా చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
‘ఫించ్’ అనే బ్రిటీష్ అధికారి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో అక్కడున్న ఉద్యమకారులు రెచ్చిపోయారు. దీంతో అతను తుపాకీ తీసి భోగేశ్వరి కూతురి మీద గురిపెట్టగా ఆమె ముందుకు దూసుకెళ్లి జెండా స్తంభంతో ఆ అధికారిని బలంగా కొట్టింది. ఆ తర్వాత ఆ అధికారి భోగేశ్వరిని తుపాకీతో కాల్చి చంపాడు.
స్వాతంత్ర్యం కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటానికి గాను 1947లో దేశానికి ఫ్రీడమ్ వచ్చాక ఆమె పేరు మీద ఒక ఆసుపత్రి, ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. 1854లో అస్సాంలోని నాగాన్‌లో ఒక అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ మైల్స్ బ్రోన్సోనిస్ అనే వ్యక్తి ఈ ఆస్పత్రిని స్థాపించగా.. దీనికే ‘షహీద్ భోగేశ్వరి ఫుకాన్’ సివిల్ హాస్పిటల్‌గా నామకరణం చేశారు. అస్సాం రాజధాని గువహటిలో ఆమె పేరు మీద ఇండోర్ స్టేడియం ఉంది.