ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్(Shanthi Swaroop) శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. రెండు రోజుల కిందట గుండెపోటుతో యశోద హాస్పిటల్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం మృతి చెందారు.
ప్రస్తుత తరానికి ఆయన అంతగా తెలియక పోయినా 90దశకానికి చెందిన వారికి ఆయన బాగా సుపరిచతం. అప్పట్లో ఇన్ని టీవీ చానళ్లు ఉండేవి కాదు. వార్తలు చూడటానికి టీవీలో కేవలం దూరదర్శన్ మాత్రమే ప్రసారం అయ్యేది. అందులో రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమయ్యేవారు శాంతి స్వరూప్. తెలుగులో ఏళ్ల పాటు తన న్యూస్ రీడింగ్, యాంకరింగ్ తో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు.
దూరదర్శన్ అనగానే మొట్ట మొదట ఆయన గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు. అలా ఏళ్ల పాటు దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తన సేవలను అందించారు. ఆయన 1977 అక్టోబర్ 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను మొదలుపెట్టగా అందులో మొట్టమొదటిగా తెలుగు యాంకర్‌గా స్వరూప్ పనిచేశారు. ఇప్పుడంటే న్యూస్ చదివే వారికి టెలీప్రాంప్టర్ ఉంది.
అయితే టెలీప్రాంప్టర్ లేని రోజుల్లోనే ఎలాంటి తప్పులు లేకుండా వార్తలను చాలా జాగ్రత్తగా చెప్పి అందరి మన్ననలు పొందారు. ఆయన 2011లో దూరదర్శన్ నుంచి పదవి విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. శాంతి స్వరూప్ మృతిపట్ల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, అలాగే జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ‘తెలుగు వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్‌గా శాంతి స్వరూప్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. ఆయన సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్‌లో పని చేశారు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడియా రంగంలో చిరస్మరణీయం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి..’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.